నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం : ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార  శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.   తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వెలిబుచ్చారు. అనుమతి లేని గైర్హాజరు పై సంజాయిషీకి ఆదేశించాలన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, ఆరు హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని, పేదలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు